అట్టడుగు స్థాయి నుంచి ...అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తి ఆ స్థాయికి రావడం.. ఎంతో మందికి స్ఫూర్తి నివ్వడం మామూలు విషయం కాదు దాని వెనుక కఠోరమైన శ్రమ, పట్టుదల ఉంటుంది. వీటన్నింటితో పాటు కష్టసుఖాల్లో, గెలుపోటముల్లో అతన్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన వారు ఉంటారు. అలాంటి వ్యక్తుల చేయూతతోనే కొందరు చరిత్ర తిరగరాశారు. అందరికీ ఆ వ్యక్తి సాధించిన విజయాలే గుర్తుండవచ్చు కానీ ఆ విజయాలు సాధించిన వ్యక్తి మాత్రం తాను ఈ స్థాయికి రావడానికి కారణమైన వారిని మరచిపోడు. సూపర్‌స్టార్‌గా, తలైవాగా అభిమానుల నీరాజనాలందుకుంటున్న రజనీకాంత్ జీవితంలోనూ ఇలాంటి వ్యక్తులకు చోటుంది. వారిలో అతి ముఖ్యులు ముగ్గురు . సూపర్‌స్టార్ పుట్టినరోజు సందర్భంగా వారెవరో ఒకసారి చూద్దాం.
రాజ్ బహదూర్:
తాను ఇప్పుడున్న హోదా, జీవితం అన్ని తన స్నేహితుడి వల్ల వచ్చాయని తరచూ చెబుతారు రజనీ. ఆ స్నేహితుడే రాజ్‌బహదూర్. సినిమాల్లోకి రాకముందు బెంగళూరులో బస్ కండక్టర్‌గా పనిచేసేశాడు తలైవా. అప్పుడు ఆయన కండక్టర్‌గా ఉన్న బస్‌కి డ్రైవర్‌గా ఉండేవాడు రాజ్. ఎక్కువగా ఇద్దరూ కలిసి ఒకే బస్సులో డ్యూటీ చేసేవారు. ఇద్దరికి నాటకాల పిచ్చి ఉండటంతో కలిసి నాటకాలు కూడా ఆడేవారు. రజనీలో నటన పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన రాజ్‌బహదూర్ మద్రాస్ వెళితే పెద్ద నటుడవుతావంటూ వెన్నుతట్టారు. అందుకు ఆర్థికసాయం కూడా చేశారు. రాజ్‌బహదూర్ ప్రోత్సాహంతో మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన రజనీ మిత్రుడు చెప్పినట్లే గొప్పనటుడయ్యారు. సూపర్‌స్టార్ అయినప్పటికీ స్నేహితుడ్ని మరచిపోని రజనీ..వీలు కుదిరినప్పుడల్లా రాజ్‌బహదూర్ ఇంటికి వెళ్లి సరదాగా గడుపుతుంటారు.
కె.బాలచందర్:
రజనీకాంత్‌కు నటుడిగా జన్మనిచ్చిన వ్యక్తి కె.బాలచందర్..మద్రాస్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన రజనీ అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించారు. ఆ సమయంలో రజనీలోని నటుడ్ని గుర్తించిన బాలచందర్ "అపూర్వరాగంగళ్" మూవీతో వెండితెరకు పరిచయం చేశారు . ఆ తర్వాత రజనీ ప్రభంజనం ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనకు ఈ జీవితాన్నిచ్చిన బాలచందర్ పట్ల ఎంతో గౌరవంతో మెలిగేవారు అంతేకాకుండా ఒక తండ్రిగా, గురువుగా, మార్గదర్శిగా బాలచందర్‌ను ట్రీట్ చేశారు సూపర్‌స్టార్. ఆయన కూడా రజనీని తన కొడుకులా చూసుకునేవారు.
శివకుమార్:
పైన ఇద్దరూ రజనీకి జీవితాన్ని ఇస్తే..ఆయనను అసలు సిసలు మనిషిగా మార్చిన వ్యక్తి శివకుమార్. ఈయన ప్రముఖ హీరోలు సూర్య, కార్తీల తండ్రి. ఒక ఇటీవల 75వ పుట్టినరోజు జరుపుకున్నారు శివకుమార్. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు సూపర్‌స్టార్ రజనీకాంత్. తాను కెరీర తొలినాళ్లలో సిగరెట్, మద్యానికి బానిసనని చెప్పుకొచ్చారు. అయితే అవి మానేయకపోతే భవిష్యత్తులో మంచినటుడిగా రాణించలేవని శివకుమార్ చెప్పినట్లు లేఖలో పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన హెల్త్ టిప్స్ పాటించి ఈ రోజుకి చాలా ఫిట్‌గా ఉన్నట్లు తెలిపారు. అంతటి మహోన్నత వ్యక్తి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు సూపర్‌స్టార్.