విజయం ఆయన ఇంటిపేరు..విభిన్నత ఆయన తోడు..కడుపుబ్బా నవ్వించినా..కళ్ల వెంట నీటిని ధారలు పెట్టించినా ఆయన తర్వాతే. ఆయనే విక్టరీ వెంకటేశ్..తెలుగులో ఫ్యాబ్ ఫోర్‌గా పేరు గాంచిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున తర్వాతి స్థానంలో ఉన్నా ఆ అహమే ఉండదు. సినిమా హిట్టయినా..ఫట్టయినా పెదవులపై అదే చెరగని చిరునవ్వు. నాటి ఏమి తెలియని చంటి నుంచి..నేడు అన్ని తెలిసిన బాబూ బంగారం మన వెంకటేశ్ బాబు. ఇలా ఒకదానితో మరోదానికి సంబంధం లేకుండా ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన ఈ దగ్గుబాటి అందగాడు నేడు మరో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన జీవితంలోని విభిన్న కోణాలు ఒకసారి పరిశీలిద్దాం.
రీమేక్ కింగ్:
ఒక భాషలో హిట్ అయిన సినిమాను రీమేక్ చేయడం అనే అలవాటు చాలా మంది హీరోలకు ఉండవచ్చు. కానీ ఈ ప్రక్రియలో వెంకటేశ్ కింగ్‌మేకర్. ఎంతలా అంటే..వెంకీ కెరీర్‌లో దాదాపు 72 సినిమాలు చేస్తే వాటిలో ముప్పై సినిమాలు రీమేక్ సబ్జెక్టులే..వీటిలో 80 శాతం సూపర్‌హిట్లే.
సొంత బ్యానర్‌కు ట్రెండ్ సెట్టర్ :
ఇప్పుడంటే చాలా మంది హీరోలు తమ సొంత బ్యానర్‌లో సినిమాలు చేస్తున్నారు కానీ దీనికి ట్రెండ్ సెట్ చేసింది వెంకీనే..వెంకటేశ్ నాన్నగారు రామానాయుడు పెద్ద నిర్మాత..అయినప్పటికీ హీరోల కాల్షీట్ల కోసం తెగ తిరిగేవారు..అయినా రెమ్యూనరేషన్ కుదరకపోవడం తదితర కారణాలతో ప్రాజెక్ట్‌లు పట్టాలెక్కెవి కావు..దీనిని గమనించిన వెంకటేశ్ తమ సొంతబ్యానర్‌లో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు. దీని వల్ల సంస్థకు మంచిపేరు వచ్చింది, నాయుడు గారికి నాలుగు డబ్బులు మిగిలేవి. కెరీర్ ప్రారంభం నుంచి నేటి వరకు సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌లో 17 సినిమాలు చేశాడు వెంకీ.
వివాదాలకు దూరం:
సినిమా హీరోలకు, వివాదాలకు అవినాభావ సంబంధం ఉంటుంది.. నిర్మాతలు, దర్శకుల మాట వినడం లేదనో..హీరోయిన్లతో ఎఫైర్‌లనో ఏదో ఒక రూపంలో హీరోలు వివాదాలకు కేంద్రబిందువుగా ఉంటారు. కానీ తన ఇన్నేళ్ల జర్నీలో ఎలాంటి మచ్చ లేని హీరో వెంకటేశ్ మాత్రమే.
80% సక్సెస్ రేటు:
హీరోగా వెంకటేశ్‌కు ఉన్నన్ని రికార్డులు టాలీవుడ్‌లో మరే ఇతర హీరోకు లేవు. బొబ్బిలిరాజా, చంటి, కలిసుందాం రా లాంటి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్లు వెంకీ సొంతం. 50 సినిమాలు చేసిన హీరోల్లో దాదాపు 80 శాతం విజయాలున్న ఏకైక హీరో.
ఫ్యామిలీ హీరో:
తెలుగునాట తొలి తరం ఫ్యామిలీ హీరో, ఆంధ్రుల సోగ్గాడు శోభన్‌బాబు గారి తర్వాత మహిళల్లో అంతటి క్రేజ్ సంపాదించిన హీరో వెంకటేశ్. తన సినిమాల్లో కుటుంబకథలకు ప్రాధాన్యతనిచ్చి..కుటుంబం మొత్తాన్ని థియేటర్లకు నిడిపించిన చరిత్ర వెంకీ సొంతం.
పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్:
తెలుగునాట హీరోలు హీరోయిజం మాత్రమే చేయాలి..కమెడియన్లు కామెడీ మాత్రమే చేయాలి అనే మార్క్‌ను చెరిపేసి..తనదైన కామెడీ టైమింగ్‌తో కమెడీయన్లకే సవాలు విసిరారు వెంకీ..ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, నువ్వునాకునచ్చావ్, మళ్లీశ్వరి, తదితర చిత్రాల్లో వెంకీ నటన కడుపుబ్బా నవ్విస్తుంది.